Read more!

యదు వంశపు చరిత్ర!!

 

యదు వంశపు చరిత్ర!!

 

సంభవామి యుగే యుగే అని చెప్పిన శ్రీకృష్ణుడు ఎన్ని యుగాలకైనా గొప్ప మనోవిశ్లేషనా ప్రధాత!! అలాంటి కృష్ణుడు యదు వంశపు పురుషుడు.  అయితే ఈ యదు వంశం ఏమిటి?? అనేది చాలామందికి తెలియదు.

పూర్వం సహుషుండు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు నూరు యజ్ఞాలు చేయడంతో అతనికి ఆ యజ్ఞ ఫలితాల వల్ల దేవతల లోకానికి నాయకుడు అయ్యే అవకాశం వచ్చింది. అయితే అగస్త్య మహాముని శాపం ఇవ్వడం కారణంగా ఆ అవకాశం కోల్పోయాడు. అతనికి యతి, యయాతి, సంయాతి, నాయాతి, వియతి, గృతి అని ఆరుమంది కొడుకులు ఉండేవారు. అతని తరువాత పెద్ద కొడుకైన యతి రాజ్యానికి రాజు అయ్యాడు. అతను రాజ్యకాంక్ష అన్ని పాపాలకు, అత్యాశలకి కరణమవుతుందని రాజ్యాన్ని వదిలి సన్యాసిగా మారిపోయాడు. 

అన్న, తండ్రి ఇద్దరూ లేకపోవడం వల్ల యయాతి రాజ్యభారం చేపట్టాడు. అతడు మంచివాడు అవ్వడం వల్ల ఆ రాజ్య ప్రజాలందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు. యయాతి శుక్రాచార్యుడి కూతురు దేవయానిని వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ యదువు, తుర్వసుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. 

వృషపర్వుడు అనే రాజు కూతురు శర్మిష్ఠ. శుక్రాచార్యుడి దగ్గర చదువు చెప్పించుకునేది. అయితే ఒకసారి దేవయానిని అవమానించి మాట్లాడటంతో శుక్రాచార్యుడు కోపం చేసుకుని, నా కూతురు దగ్గర పనిమనిషిగా ఉండు లేకపోతే శాపం పెడతానని అనడంతో, ఆ వృషపర్వ రాజు గతిలేక శర్మిష్ఠను దేవయాని పనిమనిషిగా పెడతాడు. శర్మిష్ఠ దేవయాని కంటే అందమైనది. ఆమె యయాతిని మాటలతో మభ్యపెట్టి అతన్ని తనవైపు తిప్పుకుంటుంది. వాళ్లిద్దరూ రహస్యంగా దృహ్యుండు, ననువు, పూరువు అనే ముగ్గురు కొడుకులను కంటారు. అయితే దేవయానికి వారి రహస్యం తెలిసిపోయి కోపంతో, బాధతో అక్కడినుండి తండ్రి శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్లి జరిగింది మొత్తం వివరంగా చెప్పేస్తుంది. 

శుక్రాచార్యుడికి కోపం పెరిగిపోయి "నువ్వు జీవితాంతం ముసలివాడిగా ఉంటావు" అని శాపం పెడతాడు. ఉన్న వయసు మొత్తం పోయి అప్పటికప్పుడు ముసలోడిలా అయిపోతాడు యయాతి. ఆ తరువాత తప్పైపోయిందని ఏడుస్తూ శుక్రాచార్యుడి కాళ్ళ మీద పడగానే శుక్రాచార్యుడి మనసు కరిగి "సరే నీకు ఈ శాపం పోయి తిరిగి నీ వయసు రావడానికి ఒక పరిష్కారం చెబుతాను. నీ కొడుకులలో ఎవరైనా సరే నీకు వాళ్ళ యౌవనాన్ని ఇచ్చి, నీ ముసలితనాన్ని వాళ్ళు తీసుకుంటామంటే అలాగే తీసుకోని" అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోతాడు.

యయాతి కొడుకులను అందరినీ రప్పించి తన శాపం గురించి వివరంగా చెప్పి "పుత్రుల్లారా!! నా శాపాన్ని మీరే పోగొట్టగలరు. మీలో ఎవరో ఒకరు మీ యౌవనాన్ని నాకు ఇచ్చి, నా ముసలితనాన్ని పోగొట్టండి" అని అడుగుతాడు.

యయాతి కోరిక తీర్చడానికి దేవయాని కొడుకులు ఎవరూ ఒప్పుకోరు శర్మిష్ఠ కొడుకులలో కూడా పెద్దవాళ్ళిద్దరూ  ఒప్పుకోరు. చిన్న కొడుకు అయిన పురూవు మాత్రం "నాన్నా నా యౌవనాన్ని మీరు తీసుకుని మీ ముసలితనం నాకు ఇవ్వండి" అని చెబుతాడు. అలా యయాతికి ముసలితనం పోయి, పురూవుకు ముసలితనం వస్తుంది. అయితే ఆ ఒక్క సంఘటనతో యయాతికి తన కొడుకులలో నిజమైన ప్రేమ కలిగింది పురూవు ఒక్కడికే అని అర్థమయ్యి మిగిలిన దేవయాని కొడుకులకు ఒక్కొక్కరికి ఒక్కో శాపం పెడతాడు. అలాగే శర్మిష్ఠ కొడుకులలో పురూవు కు రాజ్యాన్ని అప్పగించి మిగిలిన వాళ్లకు శాపం పెడతాడు. 

అలా యయాతి పురూవును వదిలి మిగిలిన కొడుకులకు శాపం పెట్టడం వల్ల  అతని వంశంలో రాజులు లేక ముఖ్యంగా దేవయాని కొడుకులలో రాజులు లేక వాళ్ళు క్షత్రియతత్వాన్ని కోల్పోయారు. చివరికి వాళ్ళు యాదవులై గోరక్షణా తత్పరులై జీవితాన్ని సాగిస్తూ వచ్చారు. అయితే వీళ్ళు క్రమముగా తరాలు మారుతున్న కొద్దీ నాయకత్వ బాధ్యతలు చేపడుతూ రాజ్యవంశాలు స్థాపించుకున్నారు. వీళ్ళ వంశంలో పుట్టినవాడే శ్రీకృష్ణుడు.

ఇదీ యదు వంశ చరిత్ర.

◆ వెంకటేష్ పువ్వాడ